Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దళిత హోం మంత్రి హయాంలో దళిత మహిళలకు రక్షణేది : పవన్ కళ్యాణ్

Advertiesment
దళిత హోం మంత్రి హయాంలో దళిత మహిళలకు రక్షణేది : పవన్ కళ్యాణ్
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (14:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత మంత్రి హోం మంత్రిగా ఉన్నారనీ, అలాంటి రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ కరువైందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా దళిత మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, హత్యలు జరుగుతున్నా నిందితులపై కేసులు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన ఆరోపించారు.
 
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రుబాయిని ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్రశ్నించారు. ఓ గిరిజన మహిళను ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టరుతో తొక్కించి చంపిన ఘటన తనను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. 
 
ఆ ఘటన గురించి తెలుసుకుంటే తన హృదయం ద్రవించిపోయిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ చట్టం తీసుకువచ్చాం, దిశ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం... గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలేదని, కేసులు నమోదు చేసుకునేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. అటవీ భూమిని సాగు చేసుకుంటున్న ఆ గిరిజన కుటుంబంపై ఘాతుకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
 
అలాగే, కర్నూలు జిల్లాలో మరో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా, పోలీసులు కేసు నమోదు చేయలేదని మీడియా ద్వారా తెలిసిందని, భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టాలు చేసి ఏం ప్రయోజనం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచుగా చోటు చేసుకుంటున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదు అంటే వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ నుంచి భద్రాచలం ఐటీసీ పేపర్‌బోర్డ్స్‌ యూనిట్‌కి గ్రీన్‌కో ప్లాటినమ్‌ ప్లస్ రేటింగ్‌