ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21వ తేదీన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మా ఆరాధ్య నేత జగనన్న పుట్టిన రోజును పురస్కరించుకుని తన నియోజకవర్గంలోని మీరా సాహెబ్ పల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న ప్రకటించారు. ఈ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చదువుకోలేదని గుర్తుచేశారు.
ఈ గ్రామంలోని కుటుంబాలు ప్రతి రోజూ కాయకష్టం చేస్తేగానీ వారి కుటుంబ పోషణ గడవదన్నారు. అందుకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని వచ్చే యేడాది జగనన్న పుట్టిన రోజు నాటికి ఈ గ్రామం రూపురేఖలు మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు.
అదేవిధంగా ఈ కోవిడ్ సమయంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నూతన వస్త్రాలతో పాటు.. వివిధ రకాలైన సామాగ్రిని అందజేస్తానని తెలిపారు.
కాగా, గత పుట్టినరోజుకు పుష్ప అనే అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్న రోజా.. ఆ యువతి కోరిక మేరకు డాక్టర్‌గా చదివించాలని నిర్ణయించింది. ఇటీవల వెల్లడైన నీట్ పరీక్షల్లో ఆ యువతి ఉత్తీర్ణత సాధించింది. అలాగే, ఈ పుట్టిన రోజుకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.