Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ ప్రత్యేక అధికారిగా కృతిక శుక్లా... భోధన, ప్రభుత్వ ఆసుపత్రులలో దిశ సౌకర్యాల కల్పనపై సమీక్ష

దిశ ప్రత్యేక అధికారిగా కృతిక శుక్లా... భోధన, ప్రభుత్వ ఆసుపత్రులలో దిశ సౌకర్యాల కల్పనపై సమీక్ష
, గురువారం, 2 జనవరి 2020 (20:45 IST)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాకు దిశ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు  మహిళల రక్షణే ధ్యేయంగా ఈ చట్టం రూపుదిద్దుకోగా, దిశా చట్టం విధి విధానాల రూపకల్పనలోనూ కృతికా శుక్లా ముఖ్యమైన భూమికను పోషించారు. 
 
చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉండగా, ప్రభుత్వం ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేసింది. యుద్ధప్రాతిపదికన ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఎం అధికారులకు స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలోనే మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై విచారణ కోసం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఆ ప్రక్రియను సమన్వయం చేసే బాధ్యత ఈ ప్రత్యేక అధికారిపై ఉంటుంది.  
 
మరోవైపు లైంగిక వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా కృతికా శుక్లా తన బృందంతో ప్రత్యేకంగా నిరంతరం పరిశీలిస్తూ ఉండటం ఈ చట్టం విధివిధానాలలో కీలకమైనది. వైద్య సేవల నిరంతర మెరుగుదలలో భాగంగా వివిధ శాఖల సమన్వయం బాధ్యతలు కూడా ఈ ప్రత్యేక అధికారి పైనే ఉంటాయి. 
 
చట్టం అమలులో భాగంగా బాధితులకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకుగాను ప్రతి బోధన, జిల్లా ఆసుపత్రిలో దిశా చట్టం కోసం పత్యేక వైద్య కేంద్రం ప్రారంభిస్తారు. ఇక్కడ మంచి ప్రమాణాలు ఉన్న వైద్యం, పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నాయని ఈ సందర్భంగా కృతికా శుక్లా తెలిపారు. సున్నా ఎఫ్ఐఆర్ నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల  సామాజిక, చట్టపరమైన సహాయం అందించటంతో పాటు, వారిలో మానసిక స్థయిర్యాన్ని నింపే తీరుగా నిరంతరం ఈ కేంద్రాలు పనిచేయవలసి ఉంటుందన్నారు.
 
ఈ కేంద్రాలలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, గైనకాలజిస్టులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయవలసి ఉందని, మరోవైపు ఈ కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. చట్టం అమలులో భాగంగా మహిళలు, పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాల నియంత్రణకు ఒక ప్రామాణిక నిర్వహణా విధానం అభివృద్ధి చేస్తామని శుక్లా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నెరవేర్చి చట్టం అమలుకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుతానని తెలిపారు. 
 
ప్రత్యేక అధికారి హోదాలో కృతికా శుక్లా మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులలో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసులతో సహకారం వంటి మొత్తం సమన్వయ భాధ్యతలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో తొలి సమన్వయ సమావేశం విజయవాడ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరుగనుంది. ఈ సమావేశంలో కృతికా శుక్లాతో పాటు వైద్య విద్య సంచాలకులు  పాల్గొననుండగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా అన్ని జిల్లా ఆసుపత్రుల అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో ప్రాధమికంగా సమావేశమై బోధన, ప్రభుత్వ ఆసుపత్రులలో దిశ సౌకర్యాల కల్పనకు సంబంధించి ఒక అవగాహనకు వస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీసం మీద చెయ్యేసి చెబుతున్నా... పవన్ నాయుడే : బొండా ఉమ