పర్యాటక శాఖ వాస్తవ స్థితిగతులపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చేలా ముఖ్యమంత్రి సమీక్షలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తు, యువజనాభ్యుదయ, క్రీడల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక రంగానికి సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకోనుండగా, జాన్ తొలి వారంలో శాఖల వారిగా సమీక్షలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి విజయ కృష్ణన్, పరిపాలన, మార్కెటింగ్ విభాగపు డైరెక్టర్లు డాక్టర్ రాజు, శ్రీనివాసరావు తదితరులతో సమావేశమైన మీనా పర్యాటక శాఖకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలపై స్పష్టత ఉండేలా నివేదికలు సిద్దం చేయాలన్నారు.
క్లుప్తంగా, పారదర్శంగా ఉండేలా ప్రజెంటేషన్ ఉండాలంటూ పలు సూచనలు చేసారు. గతేడాది బడ్జెట్-వినియోగం, ప్రస్తుత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌పై పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించిన మీనా మంగళవారం నాటికి అంతా సిద్దంగా ఉండాలని సంస్ధ ఇడి టివిఎస్‌జి కుమార్, జిఎంలు హరనాధ్, సుదర్శన్, విశ్వనాధ్, సిఇ మూర్తిలను ఆదేశించారు. సంస్ధ ఆర్ధిక పరిస్ధితికి సంబంధించిన అస్తి ఆప్పులు, లాభ నష్టాలపై స్పష్టత ఉండాలన్నారు.
ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టులపై విడిగా నివేదిక అవసరమన్న మీనా, కీలక అంశాలకు సంబంధించి ఛాయా చిత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సంస్ధలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య నానాటికీ కుదించుకు పోతున్న తరుణంలో కేటాయింపుకు అనుగుణంగా సిబ్బంది నియామక అవశ్యకతను సిఎం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఇడి కుమార్ ప్రతిపాదనను అంగీకరించిన మీనా, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన కార్యాచరణ కూడా నివేదికలో ఉండాలన్నారు.
మధ్యాహ్నం యువజనాభ్యుదయ శాఖకు సంబంధించిన సమీక్షలో ఆశాఖ కార్యకలాపాలపై పూర్తి స్ధాయి నివేదిక కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి ముందుకు సాగవలసి ఉన్నందున ఈ విభాగం తరుపున అమలవుతున్న యువనేస్తం పధకం కేటాయింపులు, లబ్ధిదారులు, అయా పధకాల తాజా పరిస్ధితి వంటి అంశాలను చర్చించారు. యువజన సర్వీసుల కమీషనర్ భానుప్రకాష్, ఎడి రామకృష్ణ తదితరులను సిఎం సమీక్షకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్‌సిసి విభాగానికి సంబంధించి కల్నల్ జి.సాయి శంకర్, మేజర్ వెంకట్ తన్నీరు తదితరులతో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నశిక్షణపై సవివరమైన నివేదిక సిద్దం చేయాలన్నారు. ప్రతి రాష్ట్రానికి ఎన్‌సిసి విభాగం ఉండగా విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ఆవిభాగం తరలిరాక పోవటంపై లోతుగా చర్చించారు.