కాకినాడ అసెంబ్లీ రూరల్ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) రంగరాయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌పై దౌర్జన్యం చేసి కొట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన నివాసంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ (ఆర్‌ఎంసీ) ప్రొఫెసర్‌పై దాడి ఘటనకు సంబంధించి తాను తప్పు చేశానని పంతం ఒప్పుకున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ కార్పొరేషన్ 2వ డివిజన్‌లో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌పై దురుసు ప్రవర్తనకు నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.
గత రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ప్రొఫెసర్, విద్యార్థులు, ఆర్‌ఎంసి అధికారులకు తాను ఇప్పటికే క్షమాపణ అడిగానని చెప్పారు. ఇంకా తన నివాసం వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ ఎమ్మెల్యేగానీ, ప్రజాప్రతినిధిగానీ అలా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించానని, తన తప్పుకు ప్రాయశ్చిత్తం కోసం ప్రాయశ్చిత దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
'తిరుపతి లడ్డూ కేసులో ఎవరో చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ 'ప్రాయశ్చిత్త దీక్ష' చేస్తుంటే, నేను చేసిన తప్పుకు నేను ఈ దీక్ష చేస్తున్నాను' అని అన్నారు. రంగరాయ వైద్య కళాశాల వద్ద కొందరు వాలీబాల్ ఆట సమయంలో ఏదో గొడవ జరిగింది. దాన్ని సెటిల్ చేద్దామని ప్రిన్సిపాల్‌కి చెప్పే వెళ్లాను. అక్కడకు వెళ్లాక నన్ను ఎవరో ఏదో అన్నారని తెలిసి ఆవేశంతో తప్పుగా మాట్లాడాను. దానికి డాక్టర్ గారికి శనివారమే క్షమాపణ చెప్పాను. అయినా నా తప్పు తెలుసుకుని ప్రాయశ్చితం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ ఎమ్మెల్యే నానాజీ ప్రజల సమక్షంలో తెలిపారు.
అయితే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చర్యను సామాజిక న్యాయ సాధన సమితి ఖండించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమితి డిమాండ్ చేసింది.
ఎమ్మెల్యే తన స్థాయిని దిగజార్చారని, వైద్యుడిపై వికృతంగా ప్రవర్తించారని సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, ప్రధాన కార్యదర్శి నవీన్ రాజ్, అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ మోకా పవన్ కూకర్, ముఖ్య సలహాదారులు జవహర్ అలీ, అయితాబత్తుల రామేశ్వరరావు తదితరులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.