Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రిగా రాలేదు.. మీ సోదరిగా వచ్చాను.. వైద్యులతో సీఎం మమతా బెనర్జీ

Advertiesment
mamata benerjee

ఠాగూర్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (15:18 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. స్వయంగా ఆమె నిరసన శిబిరానికి వెళ్లి.. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు.
 
ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం "స్వస్థ్‌ భవన్‌'' ఎదుట జూనియర్‌ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం నిరసన శిబిరానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే 'న్యాయం కావాలి' అంటూ జూనియర్‌ వైద్యులు నినాదాలు చేశారు. 
 
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమంటూ వ్యాఖ్యానించారు. 'గతంలో నేనూ విద్యార్థి నాయకురాలిగా ఉద్యమాల్లో పాల్గొన్నా. ఆందోళన చేయడం మీ హక్కు. కానీ సమస్యను పరిష్కరించేందుకు మీతో చర్చల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనలకు సెల్యూట్‌ చేసేందుకు వచ్చా. ఇక్కడికి నేను ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. కానీ, నేనొక్కదాన్నే ప్రభుత్వాన్ని నడపట్లేదు కదా. బాధితురాలికి న్యాయం జరగాలనే నేనూ కోరుకుంటున్నా' అని మమతా బెనర్జీ అన్నారు. 
 
'ఎండా, వానల్లోనూ మీరు రోడ్లపై ఆందోళన చేస్తుంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. మీ డిమాండ్లను ఖచ్చితంగా అధ్యయనం చేస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నా. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సీబీఐని కోరుతున్నా. నామీద విశ్వాసం ఉంటే.. చర్చలకు రండి. మీరు వెంటనే విధుల్లో చేరండి. మీపై ఎలాంటి చర్యలు తీసుకోబోం' అంటూ ఆమె హామీ ఇచ్చారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో మమతా బెనర్జీ ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు