ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్‍తో ఆర్ఎస్ఎస్ పత్రికా ఆర్గనైజర్‌లో ప్రత్యేక కథనం పేర్కొంది. పైగా, ఆంధ్రలో జగ్లక్ పాలన సాగుతోందని అందులో పేర్కొంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, నియంతృత్వ పోకడలతో రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నారని ఆ పత్రిక తెలిపింది.
ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనివున్న అనేక పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేసేలా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని దుగ్గరాజు శ్రీనివాసరావు అనే రచయిత సదరు వ్యాసంలో ధ్వజమెత్తారు.
రాజధానులు మార్చడంలో జగన్ తుగ్లక్‌లా వ్యవహరించి, 'జగ్లక్'గా కొత్త పేరు తెచ్చుకున్నారని ఎద్దేవాచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే రాజధానిని అమరావతి నుంచి తరలించి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని దుయ్యబట్టారు.
అంతేకాకుండా, అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు కావాలని.. అంత డబ్బు తన వద్ద లేదని జగన్ చెబుతున్నారు. కానీ ఏ నగరమూ రాత్రికి రాత్రి అభివృద్ధి చెందలేదు. దేశంలోని పెద్ద నగరాలన్నీ అట్టడుగు నుంచి అభివృద్ధిపథంలోకి వచ్చాయి. అమరావతి కూడా కాలానుగుణంగా పురోగమిస్తుందని పేర్కొంది.
ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఎంతో భూమి ఉంది. దానిని తెలివిగా వినియోగించుకుని.. పెట్టుబడులు రప్పించుకోవాలి. ఒక రాజధాని నగరం నిర్మాణానికి వివేకవంతమైన ప్రణాళిక కావాలి. ఇప్పటికే రాజధాని మార్పును చూసి రాష్ట్ర ప్రజలు శతాబ్దాల నాటి తుగ్లక్‌ను గుర్తుచేసుకుంటున్నారు. జగన్‌ను, తుగ్లక్‌ను పోల్చి ఎద్దేవా చేస్తున్నారు. ఇద్దరి పేర్లను కలిపి ‘జగ్లక్’ అని పిలుస్తున్నారు అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.