అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా మరో రెండు రాజధానులను ప్రకటించిన జగన్ సర్కార్.... ఇపుడు కొత్త రాజధాని విశాఖపై దృష్టి సారించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు 130 ఎకరాలు ఇవ్వాలని సంకల్పించారు. అలాగే, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయాలని అదానీ సంస్థలకు 130 ఎకరాలు ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. ఇప్పటికే విశాఖ పరిశ్రమలకు ప్రతీతి అని, ఇక్కడ ఉన్న సహజ సిద్ధమైన ఓడరేవు అన్ని వ్యాపారాలకు అనుకూలం అని వివరించారు.