Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

Advertiesment
rain alert

ఠాగూర్

, సోమవారం, 23 డిశెంబరు 2024 (09:55 IST)
పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా సోమవారం నుంచి గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా ఏపీలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది.
 
ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, మంగళవారం నాటికి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
 
అలాగే, ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని హార్బర్‌లలో మూడో నంబరు హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, దాదాపు ఆరు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం కదలికలను అంచనా వేయడం వాతావరణశాఖ నిపుణులకు కష్టంగా మారింది. దీని కదలికలను సరిగా అంచనా వేయడం సాధ్యపడడం లేదని చెబుతున్నారు. 
 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లవచ్చని తొలుత అంచనా వేశారు. కానీ, రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు వాయుగుండంగా మారింది. అంతలోనే శనివారం బలహీనపడింది. 
 
ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?