బ్రెజిల్ దేశంలో విషాదకర ఘటన జరిగింది. విమానం ఒకటి నివాస భవనంలోకి దూసుకెళ్లింది. ఈ విషాదక ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన ఆదివారం జరిగింది. చిన్నపాటి విమానం ఈ తరహా ప్రమాదానికి గురైంది.
తొలుత ఇంటి చిమ్నీని (పొగ గొట్టం) తాకి భవనంలోని రెండో అంతస్తులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఒక మొబైల్ ఫోన్ షాపుపై విమానం కూలిందని బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని, బిల్డింగ్ ప్రాంతంలో 12 మందికి పైగా సాధారణ ప్రజలు గాయపడ్డారని వెల్లడించింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని, హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. విమానం కూలిన ఘటనలో మృతి చెందిన ప్రయాణికులంతా ఒకే కుటుంబానికి చెందినవారని స్థానిక మీడియా పేర్కొంది. వీరంతా రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావో పాలో రాష్ట్రానికి వెళ్తున్నారని వెల్లడించింది. విమాన ప్రమాదం జరిగిన గ్రమాడో పట్టణ ప్రాంతంలో పర్వతాలు ఉంటాయి. వాతావరణం కూడా చాలా చల్లగా, మంచుకురుస్తూ ఉంటుంది. క్రిస్మస్ సెలవుల్లో ఈ ప్రాంతాన్ని పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు.