వైఎస్‌ఆర్ జలకళ పథకం ద్వారా రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తుందని, రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 28న సచివాలయంలో ఆన్ లైన్ ద్వారా ప్రారంభిస్తారని రాష్ట్ర పౌర సంబంధాల, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
తన పాదయాత్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కళ్లారా చూసి ముఖ్యమంత్రి సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ఎన్నికల మ్యానిఫెస్టో అయిన నవరత్నాల్లో ఉచిత బోర్లు పథకాన్ని చేర్చారని కమిషనర్ తెలిపారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉచిత బోర్లు హామీని వైఎస్‌ఆర్ జలకళ పథకం ద్వారా చేపట్టాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించినట్లు కమిషనర్ వెల్లడించారు.
ఉచిత బోర్లకు సంబంధించి అవసరం ఉన్న, అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా గానీ, గ్రామ సచివాలయాల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ప్రమాణాల ప్రకారం దరఖాస్తులు పరిశీలించిన పిమ్మట, హైడ్రోజెలాజికల్ & జియోఫిజికల్ సర్వే, సాధ్యాసాధాల ఆధారంగా ఉచిత బోర్లు పనులు ప్రారంభిస్తారని కమిషనర్ పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ జలకళ పథకం కోసం రైతు దరఖాస్తును సమర్పించిన తర్వాత, దరఖాస్తు స్టేటస్ ను రైతులకు వారు ఇచ్చిన మొబైల్ నంబరుకు ఎప్పటికప్పుడు SMS ద్వారా తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు.
వైఎస్‌ఆర్ జలకళ పథకం పర్యవేక్షించడానికి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేశామని, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసిన నాటి నుంచి పని పూర్తి అయిన తరువాత కాంట్రాక్టర్లకు చెల్లింపుల వరకు పూర్తి పారదర్శకంగా ఉంటుందని కమిషనర్ చెప్పారు.