రౌడీయిజం ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఉదయం మండలంలోని షాబాద్, జక్కంపూడి గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేస్తూ.. ఉపాధికి గండికొడుతోందని ఆరోపించారు.
ఈనెల 27న జరిగిన ఘటనతో జగన్ క్రూరత్వం బయటపడిందని, నిన్న పోలవరం పర్యటన తో 500కోట్ల కుంభకోణానికి తెరలేపారని, రివర్స్ టెండరింగ్‌లో ఇసుక, ఇతరత్రా పనులకు ఒకే సంస్థకు కట్టబెట్టేందుకే జగన్ పర్యటించారన్నారు. పోలవరంలో అప్పుడే దోపిడీ మొదలు పెట్టారని, జగన్ చెప్పింది చేసే ముందు అధికారులు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పరిస్థితి గుర్తుతెచ్చుకోవాలని దేవినేని ఉమా సూచించారు.
ప్రభుత్వం బలవంతంగా విమానం ఎక్కించి చంద్రబాబు ఒక్కరినే విశాఖ నుంచి పంపలేదని, ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల బాగు గాలికొదిలి చంద్రబాబు నాయుడు ను జైల్లో పెట్టేందుకే జగన్ పనిచేస్తున్నాడని, అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు.
జక్కంపూడి ఒక మహానగరం అయ్యేదని, 8500 ఇళ్ళు కట్టించానని చేతకాని ఎమ్మెల్యే వాటిని నేడు ఆటకెక్కించాడని మండిపడ్డారు. కొత్తూరు తాడేపల్లి లో 350 ఎకరాలు లాక్కుని తహసీల్దార్ 25 మందిపై కేసులు పెట్టించారని అనంతరం తాడేపల్లి లో ఈడా జయబాబు కుంటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.