కరోనావైరస్ దాదాపు 95 శాతానికి పైగానే రికవరీ అవుతుంది. కానీ కొంతమంది కరోనా రాగానే విపరీతంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా వుందని నిర్థారణ కాగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పారిపోతున్నారు. తిరుపతిలో సుమారు 1000 మంది ఇలా పరారైనట్లు తెలుస్తోంది.
కాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఓ యువకుడు కుప్పం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ రోగులను, చికిత్స జరుగుతున్న పరిస్థితులను చూశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రామకుప్ప మండలం కొల్లుపల్లెపాలెం బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. కరోనా భయంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.