ఆ ఆసుపత్రి కరోనా పేషెంట్లతో కిటకిటలాడిపోతోంది. ఇంతలో 40 ఏళ్ల భర్తను తీసుకుని అతడి భార్య ఆసుపత్రికి వచ్చింది. తన భర్తకు చికిత్స అందించాలని కోరింది. ఐతే ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేవు మరో ఆసుపత్రి చూసుకోమన్నారు సిబ్బంది. అన్ని ఆసుపత్రులు తిరిగి ఇక్కడికి వచ్చాను, దయచేసి నా భర్తను బ్రతికించండి అని ఆమె కన్నీరుమున్నీరు అవుతోంది. ఐతే ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేశారు. బెడ్లు లేవని చెప్పేసి తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
కానీ ఆ మహిళ పడుతున్న బాధను అక్కడే ఓ బెడ్ పైన చికిత్స పొందుతున్న 85 ఏళ్ల నారాయణరావు దభద్కర్ చూశాడు. అతడి గుండె కరిగిపోయింది. వెంటనే వైద్యులను, తన కుటుంబ సభ్యులను పిలిపించాడు. నాకు 85 ఏళ్లు నిండాయి. హాయిగా నా సంతానం, మనవలు, మనవరాండ్రతో జీవించాను. ఇంకా ఈ వయసులో నాకు ఇంతకు మించి ఏమీ అవసరంలేదు. దయచేసి నా బెడ్ ఆమె భర్తకి ఇప్పంచండి అన్నాడు. అంతా షాకయ్యారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నివసిస్తున్న 85 ఏళ్ల నారాయణరావు దభద్కర్, సెకండ్ వేవ్ COVID-19 కారణంగా కరోనా బారిన పడ్డారు. దీంతో అతడిని నాగపూర్ లోని ఇందిరా గాంధీ ఆసుపత్రిలో అతి కష్టమ్మీద బెడ్‌ను పొంది అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆక్సిజన స్థాయిలు ప్రమాదకర స్థాయికి తగ్గినప్పటికీ క్రమంగా పుంజుకుంటారని వైద్యులు తెలిపారు. ఐతే ఆయన చికిత్స తీసుకుంటున్న బెడ్‌కి కాస్తంత దూరంలో 40 ఏళ్ల పురుషుడు కరోనా సోకడంతో అతడిని అతని భార్య తీసుకుని వచ్చింది. చికిత్స చేయాలని బ్రతిమలాడుతోంది.
కానీ బెడ్లు లేవనీ, వేరే ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది చెప్పారు. సిబ్బంది అలా చెప్పడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. దీనితో నారాయణరావు తన కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందిని పిలిపించారు. "నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు, నా జీవితాన్ని హాయిగా గడిపాను, నాకు బదులుగా మీరు ఈ మనిషికి మంచం అర్పించాలి, అతని పిల్లలకి అతడు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి" అని దభద్కర్ తన కుటుంబానికి, ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు.
ఐతే ఆయన ఆరోగ్యరీత్యా అతని కుటుంబ సభ్యులు, డాక్టర్ ఆయన మనసు మార్చాలని ప్రయత్నించారు. అతనికి చికిత్స అవసరమని, తరువాత అతడికి మరో బెడ్ దొరికే అవకాశం లేదనీ, చికిత్స తీసుకోనట్లయితే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
కానీ నారాయణరావు మాత్రం వారి మాటలు వినలేదు. ఆ 40 ఏళ్ల వ్యక్తి కోసం తన మంచం ఇచ్చేస్తున్నాననీ, ఇది తన సమ్మతితోనే జరుగుతుందని పేర్కొంటూ దభద్కర్ సమ్మతి పత్రంలో సంతకం చేసి ఆసుపత్రికి సమర్పించారు. వెంటనే ఆ 40 ఏళ్ల వ్యక్తికి ఆ బెడ్‌ను ఇచ్చి నారాయణరావును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. ఆయనను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు, ఆరోగ్యం క్షీణించడంతో మూడు రోజుల తరువాత కన్నుమూశారు.
"నారాయణరావుకు బెడ్ దొరికినప్పటికీ, అతను సాటి రోగి కోసం మానవత్వంతో తన బెడ్‌ను త్యాగం చేశారు. ఆయన తోటి రోగి పట్ల చూపిన దయ, కరుణతో అమరుడు అయ్యాడు" అని ఆస్పత్రి COVID-19 డాక్టర్ అజయ్ హర్దాస్ పేర్కొన్నారు.