ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో కీలక ములుపు తిరిగింది. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు సంపాదించుకున్నట్టు తేలింది. దీంతో ఆ ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ఏపీ సర్కారు ఆమోదముద్ర వేసింది.
తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎన్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులను జప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం స్కామ్ ద్వారా చెవిరెడ్డి ఫ్యామిలీ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సిట్ విచారణలో తేలింది.
సుమారు రూ.54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ చేసిన విజ్ఞప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీశారు. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.