అతివేగం ఓ యువ క్రీడాకారిణి ప్రాణాలు తీసింది. వెయిట్ లిప్టింగ్ పోటీల్లో రాష్ట్రానికి పతకం తేవాలని బయలుదేరిన యువ క్రీడాకారిణి ఒకరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. విజయనగరంలో శనివారం సాయంత్రం లారీ ఢీకొనడంతో వెయిట్ లిఫ్టర్ టి. సత్యజ్యోతి (24) మృతి చెందారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ టోర్నమెంటులో పాల్గొనేందుకు తన సోదరి సరోజిని గాయత్రితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న సరోజిని గాయత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనుక కూర్చున్న సత్యజ్యోతి తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
విజయనగరానికి చెందిన భాస్కరరావు, యశోదమ్మ దంపతుల నలుగురు సంతానంలో సత్యజ్యోతి చివరి అమ్మాయి. జాతీయ వెయిట్ లిఫ్టర్‌గా రాణించి క్రీడా కోటాలో యేడాదిన్నర క్రితం రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. సత్యజ్యోతి తల్లి మూడేళ్ల కిందట మృతిచెందారు.
తండ్రి అనారోగ్యంతో చనిపోయి నెల కూడా కాలేదు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే ఆమె మృతి చెందడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టోర్నమెంట్‌లో జిల్లా తరపున ఈ నెల 16న ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని రెండో పట్టణ పోలీసులు వెల్లడించారు.