ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని వైకాపా గూండాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఉండవల్లిలో ఆయన సోమవారం ఉదయం తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు.
'ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. విదేశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలి' అని చంద్రబాబు తెలిపారు.