పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై వైకాపా వర్గీయులు భౌతికదాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఏపీలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు ఓటింగ్ ప్రక్రియను ప్రారభించారు.
ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు.
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.