Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్కులు - పీపీఈ కిట్లు ఇవ్వలేదన్న వైద్యుడిపై కేసు - పిచ్చాసుపత్రికి తరలింపు!!

మాస్కులు - పీపీఈ కిట్లు ఇవ్వలేదన్న వైద్యుడిపై కేసు - పిచ్చాసుపత్రికి తరలింపు!!
, ఆదివారం, 17 మే 2020 (15:15 IST)
కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు అవసరమైన ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెండ్ వేటుకుగురైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనకు పిచ్చి ఉందని పేర్కొంటూ పిచ్చాసుపత్రికి తరలించారు. పైగా, డాక్టర్ సుధాకర్ పట్ల వైద్యులు ప్రవర్తించిన తీరు రాష్ట్రంలో కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నర్సీపట్నం ఏర్పియా ఆస్పత్రిలో అనస్థీషియాగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కరోనా రోగులకు వైద్యం చేసే వైద్యులు ధరించే ఎన్-95 మాస్కులతోపాటు.. పీపీఈ కిట్లు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ఈ విమర్శనను తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు ఆయన్ను సస్పెండ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 353, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను పిచ్చాసుపత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని, మెంటల్ ఆస్పత్రికి తరలించాలని కేజిహెచ్ సూపరింటెండెంట్ అర్జున రిఫర్ చేశారు. శనివారం రోజే సుధాకర్‌కు మతిస్థిమితం లేదని భావించి పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించడం జరిగింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 
అసలేం జరిగింది..!?
విశాఖపట్నంలో నివాసం ఉండే ఆయన.. శనివారం సాయంత్రం తన కారులో జాతీయ రహదారిపై వెళుతూ అక్కయ్యపాలెంలోని పోర్టు ఆస్పత్రి వద్ద ఆగారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదుగానీ, ఎవరో 100 నంబర్‌కు డయల్‌ చేశారు. నాలుగో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో సుధాకర్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ.. రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ కనిపించారు. 
 
ఆయనను ఓ కానిస్టేబుల్‌ లాఠీతో కొట్టాడు. దాంతో సుధాకర్‌ 'నేను ఆస్పత్రిలో లోపాలు బయటపెట్టాను. అందుకని ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌ నన్ను టార్గెట్‌ చేశారు. పోలీసులను పంపించారు. నన్ను చంపేస్తారు.. రక్షించండి' అంటూ రోడ్డుపై దొర్లుతూ గుమిగూడిన వారిని ప్రాధేయపడడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు.. ఆయన మెడపై లాఠీ పెట్టి, రెండు చేతులు వెనక్కివిరిచి, తాళ్లతో బంధించి స్టేషన్‌కు తరలించారు. అనంతరం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన తీరుపై విపక్ష పార్టీల నేతలంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డాక్టర్లకు మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు పిచ్చోడుగా ముద్ర వేసి, విశాఖ నడిరోడ్డుపై ఆయనను తాళ్లతో కట్టి.. కొడుతూ పశువు మాదిరిగా ఆయనను ఆటోలో వేసుకుని వెళ్లడం చాలా దారుణమన్నారు. 
 
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం, ఆయా కుటుంబాలను పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేయడం పరిపాటిగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దళితులను అణచివేసేందుకు దశలవారీగా కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో చుక్కలు తాకుతున్న చికెన్ ధరలు