Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: కోయంబేడు మార్కెట్ నుంచి కోనసీమకు, ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’

కరోనావైరస్: కోయంబేడు మార్కెట్ నుంచి కోనసీమకు, ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
, శనివారం, 16 మే 2020 (10:34 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా... కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. కానీ వారం రోజుల కిందట... అంటే మే 7 నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 9 మాత్రమే. కానీ 14వ తేదీ సాయంత్రానికి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 151కి పెరిగాయి.

 
ఒకేసారి పెద్ద సంఖ్యలో పెరిగిన కేసులన్నీ కోయంబేడు వెళ్లి వచ్చిన వారు, లేదా వారి కాంటాక్ట్ కేసులే అని జిల్లా యంత్రాంగం నిర్ధరించింది. ఈ కోయంబేడు కేసులు కేవలం చిత్తూరుకే పరిమితం కాకుండా ఏపీలోని అనేక జిల్లాల్లో కనిపిస్తున్నాయి. అసలు కోయంబేడుకి ఏపీతో ఉన్న సంబంధం ఏమిటి?

 
రోజుకి లక్ష మంది వచ్చే మార్కెట్..
తమిళనాడులోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్లలో కోయంబేడు ఒకటి. చెన్నై మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ మార్కెట్ సుమారు 2 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ మార్కెట్ ప్రాంగణంలో 1,200 పైగా షాపులు ఉన్నాయి. అందులో 200 హోల్ సేల్ షాపులు కాగా, మరో వెయ్యికి పైగా రిటైల్ దుకాణాలు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి ఈ మార్కెట్‌కి ఉత్పత్తులు తరలిస్తారు.

 
ఆంధ్రప్రదేశ్‌లోని సమీప చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి అత్యధికంగా కోయంబోడు మార్కెట్‌కి వెళ్లి రావడం అలవాటు. సాధారణ రోజుల్లో సుమారు 5 వేల టన్నుల కూరగాయాలు ఈ మార్కెట్‌కి వస్తూ ఉంటాయి. పండుగలు, ఇతర సీజన్లలో అయితే రోజుకి లక్ష మంది మార్కెట్‌కి వస్తూ ఉంటారు.

 
లాక్‌డౌన్‌లోనూ మూతపడలేదు..
మార్చి 24 అర్థరాత్రి దేశమంతా లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. కానీ కోయంబేడు మార్కెట్‌లో కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా కూరగాయాల కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో మార్కెట్‌ని యథావిధిగా తెరవడానికి అనుమతి ఇచ్చారు. దాంతో పెద్ద సంఖ్యలో క్రయవిక్రయాలు కొనసాగాయి.

 
కోయంబేడుకి సుదూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా కోనసీమ నుంచి కూడా రైతులు తమ ఉత్పత్తులను తరలించారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని మార్కెట్లు మూతపడగా, కోయంబేడులో మాత్రమే కొనుగోళ్లు, అమ్మకాలకు అవకాశం ఉండడంతో అందరూ అటు మొగ్గారు. చివరకు కోయంబేడు మార్కెట్ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయ్యిందనే అభిప్రాయం బలపడుతోంది.

 
ఇప్పటికే కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారు , అక్కడి అమ్మకందారులు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. దాంతో చివరకు ప్రభుత్వం ఏప్రిల్ 26 తర్వాత ఇక్కడ లాక్‌డౌన్ ప్రకటించింది. మార్కెట్‌ని వికేంద్రీకరించి వేర్వేరు ప్రాంతాలకు తరలించే యోచన చేశారు. సీఎండీఏ ప్రతిపాదనను పలువురు వ్యాపారాలు అంగీకరించలేదు.

 
దాంతో ఏప్రిల్ 26 నుంచి ప్రజలు ఎవరూ కోయంబేడుకి రాకుండా ఆంక్షలు విధించారు. మార్కెట్‌లో దుకాణాలు తెరవకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న కొంత సడిలింపు ఇవ్వడంతో మళ్లీ మార్కెట్ వద్దకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు.

 
వెయ్యి మంది క్వారంటైన్..
కోయంబేడు మార్కెట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారి ద్వారా తమిళనాడులో ఒక్కసారిగా కేసులు పెరగడంతో అధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. మార్కెట్ ద్వారా సమస్య వస్తుందనే విషయం గుర్తించేటప్పటికే సమస్య తీవ్రమయింది. అటు తమిళనాడులో కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఇటు ఏపీలోనూ పెద్ద సంఖ్యలో బాధితులు బయటపడ్డారు.

 
వారిలో మార్కెట్ వ్యాపారులతో పాటు, కొనుగోలుదారులు కూడా ఉండడంతో యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. చివరకు మే 5వ తేదీన మార్కెట్ వ్యవహారాలను వివిధ ప్రాంతాలకు తరలించారు. అప్పటికే కోయంబేడు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. దాంతో మే 7 తర్వాత కేసులు బయటకు వచ్చాయి.

 
ఏపీలోనే సుమారు 70 కేసులకు పైగా కోయంబేడుతో సంబంధాలున్న వారివే నమోదు కావడం విశేషం. దాంతో ఆయా బాధితులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వారిని గుర్తించి క్వారంటైన్‌కి తరలించడం మొదలయ్యింది. కోయంబేడు మార్కెట్‌తో నేరుగా సంబంధం ఉన్న వ్యాపారాలు, కొనుగోలుదారులు, లారీ డ్రైవర్లు, హమాలీలతో సహా సుమారుగా వెయ్యి మందిని ఏపీలో క్వారంటైన్‌కి తరలించారు.

 
కోనసీమ, నూజివీడుల్లో కూడా కోయంబేడు కేసులు
ఏపీలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ కోనసీమ ప్రాంతం మాత్రం కొంత ప్రశాంతంగా కనిపించింది. మార్చి 30వ తేదీన కొత్తపేటలో మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారి కాంటాక్ట్ కేసులతో కలిపి ముగ్గురికి పాజిటివ్ రాగా, ఆ తర్వాత మే 10 వరకూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 

 
అంతా ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో హఠాత్తుగా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో ఓ లారీ డ్రైవర్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అధికారులు ఆరా తీస్తే కోయంబేడు వెళ్లివచ్చినట్టు అంగీకరించారు. ఆ వెంటనే కొత్తపేట మండలంలో మరో మూడు కాంటాక్ట్ కేసులు కూడా నమోదయ్యాయి.

 
‘కాంటాక్ట్ కేసుల వివరాలన్నీ సేకరిస్తున్నాం: ఆర్డీవో
తమిళనాడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారి వివరాలన్నీ సేకరిస్తున్నామని అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్ తెలిపారు. కొబ్బరి సహా పలు ఉత్పత్తులను కోయంబేడుకి తరలించినట్టు ఆయన వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసు ఓ లారీ డ్రైవర్ అని తెలిపారు.

 
‘‘కుటుంబ సభ్యులతో పాటుగా కాంటాక్ట్ అయిన వారందరినీ గుర్తించాం. వారిని క్వారంటైన్‌కి తరలించాము. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే వివరాలన్నీ సేకరిస్తున్నాం. కోనసీమలో ఇప్పటి వరకూ కేసులు లేని ప్రాంతంలో తాజాగా కేసులు రావడంతో కొంత ఆందోళన ఉంది. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎవరూ కలవరపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది’’ అని ఆయన వివరించారు.

 
కోనసీమతో పాటు కృష్ణా జిల్లా నూజివీడులో కూడా కోయంబేడు ఆనవాళ్లు కనిపించాయి. నూజివీడులో మరో లారీ డ్రైవర్‌కి పాజిటివ్‌గా తేలింది. దాంతో యంత్రాంగం పలువురికి పరీక్షలు చేస్తోంది. ఇలా తమిళనాడు సమీపంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మాత్రమే కాకుండా కోయంబేడు సమస్య ఏపీలోని దాదాపుగా 10 జిల్లాలకు ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది.

 
ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కోయంబేడుతో సంబంధం ఉన్న వారందరినీ క్వారంటైన్‌కి తరలించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తోందని ఏపీ కోవిడ్ 19 నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు.

 
సమస్య గుర్తించాం.. చర్యలు తీసుకుంటున్నాం: కోవిడ్ 19 నోడల్ అధికారి
తమిళనాడులో కేసులు సంఖ్య పెరుగుతున్న తీరుని గుర్తించి, కోయంబేడు మార్కెట్ విషయంలో అప్రమత్తం అయ్యామని అర్జా శ్రీకాంత్ బీబీసీతో చెప్పారు. సమస్యను గుర్తించి, దానికి అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.

 
"కోయంబేడు మూలాలు పూర్తిగా సేకరిస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యపై స్పందించారు. సమీక్ష నిర్వహించి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మార్కెట్‌తో మొదట నాలుగు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని భావించాము. కానీ ఇప్పుడది ఎక్కువ జిల్లాల్లోనే ఉంటుందని స్పష్టం అవుతోంది. అక్కడికి వెళ్లిన లారీల వివరాలు, సిబ్బంది సమాచారం సేకరించాము. అందరినీ క్వారంటైన్‌కి పంపించే ప్రక్రియ జరిగింది. పరీక్షలు చేసి, అవసరమైన వారందరికీ చికిత్స అందిస్తున్నాం. కాంటాక్ట్ కేసుల విషయంలో కూడా అదే రీతిలో జాగ్రత్తలు పాటిస్తున్నాము. తమిళనాడు సమీపంలో ఉన్న చిత్తూరులో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో దాదాపుగా అన్నీ కోయంబేడుతో ముడిపడినవి కావడంతో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాం" అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ దేవరపల్లి నుంచి చిరుతపులి పారిపోయింది