Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ దేవరపల్లి నుంచి చిరుతపులి పారిపోయింది

హైదరాబాద్ దేవరపల్లి నుంచి చిరుతపులి పారిపోయింది
, శనివారం, 16 మే 2020 (10:20 IST)
నిన్న మైలార్ దేవరపల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న మొదలైన ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగింది. శంషాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో జల్లెడ పట్టిన అధికారులు చిరుత జాడలను పాదముద్రల సహకారంతో గుర్తించారు. 
 
అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా, నిన్నటి నుంచి గుర్తించే ప్రయత్నాలు చేశారు. పోలీసు శాఖ సహకారం తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శోధించారు. డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. చివరకు చిరుత పాదముద్రలను ఫార్మ్ హౌస్‌లో గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏవైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. 
 
నిన్న రోజంతా అక్కడే ఉండి, గత రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా, చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన సీసీ కెమెరాల్లో చిరుతకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. 
 
మళ్లీ ఆహారం కోసం అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు దానిని బంధించేందుకు అవసరమైన బోనులను (Cage), సీసీ కెమెరాలను కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే ఒక ప్రత్యేక పర్యవేక్షణ టీమ్‌ను, రెస్క్యూ గ్రూప్‌ను ఉంచనున్నారు. 
 
మళ్లీ చిరుత నగరం వైపు రాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని, ప్రజలను అప్రమత్తం చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
చిరుత ఆపరేషన్‌లో సహకరించిన పోలీసు శాఖకు, సిబ్బందికి అటవీశాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వ్యవసాయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ హైవేలో కనిపించిన చిరుతపులి.. అడవుల్లోకి వెళ్ళిపోయింది..