కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మార్చి 18వ తేదీ 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది.
గురువారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను పారాయణం చేస్తారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. కాగా ఇప్పటివరకు టిటిడి పది అఖండ పారాయణాలను విజయవంతంగా నిర్వహించింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుండి 9 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.