చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. చర్మానికి ఈ రుతువులో అదనపు రక్షణ చాలా అవసరం. ఆ రక్షణను అందించే నూనెలను చర్మం మీద మర్దన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు ఉపకరించే నూనెలు...
నువ్వుల నూనె: ఈ నూనెలో ఉన్న విటమిన్ బి, ఇ లు చర్మానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియం ద్వారా చర్మం లబ్దిపొందుతుంది. సూర్య కాంతి ప్రభావం చర్మం మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనెతో శరీరం మర్దన చేయించుకుంటే అలసట పోతుంది. చర్మానికి తాజాదనం సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
ఆలివ్ నూనె: చర్మ సౌందర్యానికి చక్కని సాధనం ఆలివ్ నూనె. దీనిలో ఉన్న విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వలన చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనెను మర్దన చేస్తే చర్మం ఎంతో చక్కని తేజస్సును పొందుతుంది.
కొబ్బరి నూనె: దీనిలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనెను చలికాలంలో శరీరానికి రాసుకుంటే ముడుతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఏ తరహాకి చెందినదైనా కొబ్బరి నూనె వాడకం సరైనదే. పలు రకాల చర్మరోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుంది.