కరోనావైరస్ ఎంతోమంది జీవితాలను చిదిమేస్తోంది. రోజుల వ్యవధిలోనే ప్రాణాలను కబళిస్తోంది. అంతులేని విషాదాలను మిగులుస్తోంది. ఏం చేస్తుందిలే అనుకుని ఏమరపాటుగా వ్యవహరిస్తే రెప్పపాటులో జీవితంలోకి ప్రవేశిస్తుంది. ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
దేశంలో మహారాష్ట్రంలో వేలల్లో కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఆ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీషా జాదవ్ కరోనా వైరస్ సోకి మరణించారు.
ఆమె తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన చివరి సందేశం వైరల్ గా మారింది. 51 ఏళ్ల మనీషా జాదవ్ తన పోస్టులో.. ''ఇదే చివరి గుడ్ మార్నింగ్ కావచ్చు. ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మకు చావులేదు'' అని రాశారు. ఈ పోస్టు ఆదివారం నాడు చేశారు. 36 గంటలు గడవక ముందే ఆమె కరోనా కారణంగా చనిపోయారు.
కాగా కరోనా విజృంభణ నేపధ్యంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. మహారాష్ట్రలో సుమారు 18 వేల మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారనీ, వారిలో 168 మంది ప్రాణాలు కోల్పాయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. వైద్యులను కరోనా కాటేస్తూ పోతుండటంతో మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల చేతుల్లోనే లక్షల మంది రోగుల ప్రాణాలు నిలుస్తాయి. అలాంటి వైద్యులనే కరోనా పొట్టనబెట్టుకుంటోంది.