వజ్రం అంటే రోజా పువ్వులాంటివి.. ఆకుపచ్చవి చూసివుంటాం. ఎప్పుడైనా నలుపు వజ్రాన్ని చూశారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. నక్షత్ర మండలం నుంచి ఊడిపడిన అలాంటి ఓ అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. 260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు.
ఇది నలుపు రంగులో వుందని.. ఎలా వుద్భవించిందనేది ఇప్పటికీ మిస్టరీనేనని సోతెబీ వెల్లడించింది. 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని తెలిపింది. ఆ తర్వాత నిపుణులు 55 మొహాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొంది. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్ పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు.
కాగా, అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ వజ్రాన్ని ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్‌లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్‌లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని సోతెబీ పేర్కొంటోంది. దాని పేరు ఎనిగ్మా.. బరువు 555.55 క్యారెట్లు.