కత్తి మహేష్‌కు తిక్కకుదిరింది.. నగరంలో అడుగుపెడితే మూడేళ్లు జైలే
సినీ విమర్శకుడు కత్తి మహేష్ తిక్కకుదిరింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ
సినీ విమర్శకుడు కత్తి మహేష్ తిక్కకుదిరింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో కత్తి మహేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్వామి పరిపూర్ణానంద స్వామి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ను గృహనిర్బంధం చేశారు.
అదేసమయంలో కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటువేశారు. ఆర్నెల్లపాటు నగరంలో అడుగుపెడితే మూడేళ్ళ జైలుశిక్ష తప్పదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా సరే ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే, చర్యలు తీసుకుంటామన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ను ఆర్నెల్ల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని, అదే జరిగితే మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని డీజీపీ వివరించారు.
ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమన్నారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోరుతున్నామని తెలిపారు.
గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా... రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.