బంగారు చెవి రింగులను ఎలుక దొంగలించిందట. ఈ కథ బీహార్‌లో జరిగిందట. గతంలో బీహార్‌లో 200 కేన్ల మద్యం తాగాయని అక్కడి పోలీసులు చెప్పిన సంగతి గుర్తుండే వుంటుంది. ప్రస్తుతం బీహార్, పాట్నాలోని నవరతన్ జువెల్లర్స్ షాపు యజమాని ఎలుక చెవి రింగును దొంగతనం చేసిందని చెప్పి.. షాక్ ఇచ్చాడు.
సదరు షాపు యజమాని ధీరజ్ కుమార్.. తన షాపు నుంచి బంగారం రింగుల్ని దొంగలించిందని.. స్వయంగా వివరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ధీరజ్ కుమార్ దుకాణంలో ఉన్న ఓ ప్లాస్టిక్ సంచి నుంచి బంగారు చెవి రింగుల్ని ఒక ఎలుక దొంగలించి పార్వతీ దేవి ఫోటోకి సమర్పించిందట.
ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పర్వదినమని.. అది మామూలు ఎలుక కాదని.. దైవ స్వరూపం అంటున్నాడు ధీరజ్. ఎలుక సంచిలో ఉన్న చెవి రింగులను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందట. అంతేకాదు.. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లేందుకు తన దుకాణాన్నే ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు. తానేదో పుణ్యం చేసుకున్నానని సంబరపడిపోతున్నాడు. అదన్నమాట సంగతి.