Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొందరు దేవుళ్లు - దేవతలుగా ఊహించుకుంటున్నారు : సంజయ్ రౌత్

కొందరు దేవుళ్లు - దేవతలుగా ఊహించుకుంటున్నారు : సంజయ్ రౌత్
, సోమవారం, 18 నవంబరు 2019 (12:43 IST)
కొందరు తమను తాము దేవుళ్లు, దేవతులుగా ఊహించుకుంటున్నారనీ ఇది ఏమాత్రం వారికి మంచిది కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో శివసేన ఎంపీలకు పార్లమెంటులో విపక్షాల వైపు సీట్లు ప్రభుత్వం కేటాయించింది. 
 
దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ మీడియాతో మాట్లాడుతూ, అందరూ ప్రజాస్వామ్యానికి కట్టుబడాలని, ఏ ఒక్కరూ తమను తాము దేవుడు గానో, దేవత గానో భావించరాదని అన్నారు. 'మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితికి అహంకారమే కారణం. ఎన్డీయే నలుగురు వ్యవస్థాపకుల్లో మేము కూడా ఒకరం. ఎన్డీయే అనేది ఏ ఒక్కరి ఆస్తో కాదు. కొందరు మాత్రం తామే దేవుళ్లమనుకుంటున్నారు' అని ఆయన మండిపడ్డారు. 
 
పైగా, మాట ఇచ్చి వెనుకడుగు వెస్తే అది మంచి పద్ధతి కాదని, ఎన్డీయే స్థాపించిన నలుగురు నేతల్లో బాలాసాహెబ్ ఠాక్రే ఒకరని, ఎన్డీయేను తాము చాలాసార్లు కాపాడామన్నారు. 'ఏరోజూ మేము వాళ్ల చేతిని విడిచిపెట్టలేదు. అయితే ఈ రోజు వాళ్లే దేవుళ్లమని అనుకుంటున్నారు. ఎన్డీయే నుంచి సేనను తొలగించాలనుకుంటే మీరు దేవుడే కాదు' అని రౌత్ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, మహారాష్ట్రలో ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై అడిగినప్పుడు, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని, శివసేన నుంచే ముఖ్యమంత్రి ఉంటారని చెప్పారు. మూడు పార్టీల మధ్య కుదిరే కనీస ఉమ్మడి ప్రోగ్రాం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. మహారాష్ట్ర ప్రగతిశీలక రాష్ట్రమని, సుస్థిర ప్రభుత్వం ఉండితీరాలని రౌత్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్ళపారాణి ఆరకముందే భర్తకు విషమిచ్చిన భార్య.. ఎక్కడ?