రెండు నాలుకల అమిత్ షా... ఇపుడు స్వరం మార్చారు?
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:14 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వరం మార్చారు. రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నిన్నగాకమొన్న తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తంకావడంతో ఆయన చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకీ అమిత్ షా స్వరం ఎందుకు మార్చారో ఇపుడు తెలుసుకుందాం.
ఒకే దేశం .. ఒకే పన్ను, ఒకే దేశం.. ఒకే భాష అన్నది ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు నినాదం. ఇందులో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని (జీఎస్టీ) అమల్లోకి తెచ్చారు. ఇపుడు ఒకే దేశం.. ఒకే భాష (హిందీ)ను అమలు చేసేందుకు ప్రణాళికలు రచించారు.
ఇందులోభాగంగా, హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేసింది. దీనిపై హోం మంత్రి అమిత్‌షా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం లేదని, అది తమ ఉద్దేశం కాదన్నారు.
మాతృభాష తర్వాత హిందీ నేర్చుకావాలన్నదే తమ అభిమతమని, ప్రాంతీయ భాషలను కించపరచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని చెప్పారు. గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన తన మాతృభాష కూడా హిందీ కాదని వివరణ ఇచ్చారు.
ఇదిలావుండగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా స్పందిస్తూ, 'ఒకదేశం, ఒకే భాష' ఆవశ్యకత గురించి వివరించారు. ప్రాంతీయ భాషలు చాలానే ఉన్నప్పటికీ దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారని, ఆ దృష్ట్యా హిందీని జాతీయ భాషగా చేయాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగే సత్తా హిందీకి ఉందన్నారు.
ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రాంతీయ పార్టీల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. హిందీని బలవంతంగా రుద్దే ఎలాంటి ప్రయత్నాలనైనా ధీటుగా ఎదుర్కొంటామని, పోరాటాలకైనా సిద్ధమేనంటూ పలువురు నేతలు బాహాటంగానే ప్రకటించారు. సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అమిత్‌షా తన వ్యాఖ్యలపై ఇవాళ వివరణ ఇచ్చారు.
తర్వాతి కథనం