''మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా... అంతలోపు వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు.." అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ ఆందోళనకారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీ నేతలను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో హాజరయ్యేందుకు కాకినాడకు చేరుకున్న చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రధాని మోదీని అనుమతించేదిలేదని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. అయితే తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆందోళనకారులను భద్రతా సిబ్బంది కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో చంద్రబాబు వాహనం కాసేపు ఆగిపోయింది. ఫలితంగా సహనాన్ని కోల్పోయిన చంద్రబాబు ఆందోళనకారుల వద్ద మాట్లాడారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి చెందిన వారు ఇలాంటి ఆందోళనలు చేపట్టేందుకు ఎలాంటి హక్కు లేదన్నారు. ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలి. బీజేపీ అధ్యక్షుడు, ప్రధాని నరేంద్ర మోదీ బాగోతాన్ని బయటికి చెప్తే.. అది మిమ్మల్ని అవమానించినట్లవుతుంది. ఏపీకి మోదీ ఏం చేశారు.. ఏపీకి అన్యాయం చేశారు. ఆయన పేరును పెట్టుకుని ప్రజల వద్దకు పోకండి. ప్రజలు చూస్తూ ఊరుకోరు. "నేను కొంచెం టైమ్ ఇస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
అంతేగాకుండా.. ''ఏరుకోరి సమస్యలు సృష్టించకండి. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు. ఈ గడ్డపై వుండి.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి మద్దతు పలుకుతారా..? మోదీ ఈ రాష్ట్రానికి ఏం చేశారు. ముంచేశారు. ఈ గడ్డపై వుండి ఈ నీరు తాగుతూ.. ఆయనకు సపోర్ట్ చేస్తారా.. ఇదేం బాగోలేదు. వెళ్ళండి" అంటూ బీజేపీ కార్యకర్తలపై వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.