ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఏ క్షణమైనా వెలువరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
అన్ని భద్రతా చర్యలను తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని సూచించింది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఇప్పటికే 4 వేల అదనపు పారామిలిటరీ బలగాలను తరలించింది.
మరోవైపు, బీజేపీ నేతలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. మంత్రులంతా సమయమనం పాటించాలని పిలుపునిచ్చారు. అయోధ్య తీర్పును వినయపూర్వకంగా అంగీకరించాలని తన క్యాబినెట్ సహచరులకు మోడీ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
తీర్పుపై అనవసర వ్యాఖ్యలు చేయరాదు అని వారికి ఆయన స్పష్టం చేశారు. స్నేహపూర్వ వాతావరణాన్ని ప్రదర్శించాలన్నారు. గెలుపు, ఓటమి దృష్టితో తీర్పును చూడరాదన్నారు.