చంద్రుడిపై భారత కీర్తిపతాక ‘విక్రమ్'పై ఆశలు సజీవంగా ఉన్నాయంటూ ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తీపికబురునందించారు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు 14 రోజులపాటు ప్రయత్నిస్తామన్నారు. ప్రయోగం 95 శాతం విజయవంతమైందని.. ఆర్బిటార్‌తో చంద్రున్ని శోధిస్తామని ప్రకటించారు.
జాబిల్లిపై మన తొలిసంతకం అంతులేని ఉత్కంఠను మిగిల్చినా.. ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. శివన్ బృందానికి దేశమంతా అండగా నిలిచింది. మిమ్మల్ని చూసి గర్విస్తున్నామంటూ వారిలో అంతులేని ఆత్మైస్థెర్యాన్ని నింపింది. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారంటూ రాష్ట్రపతి కోవింద్ అభినందించగా.. త్వరలో నవోదయాన్ని చూస్తామని ప్రధాని మోడీ శాస్త్రవేత్తల్లో స్ఫూర్తిని నింపారు.
కాగా, విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని తలుచుకొని శివన్ విలపించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఓదార్చారు. ఈ దృశ్యం యావత్ దేశాన్ని కదిలించింది. చంద్రయాన్-2 ప్రయాణం ఓ అద్భుతమంటూ ప్రపంచమంతా కీర్తించింది. అతి తక్కువ బడ్జెట్‌లో అబ్బురపరిచే విజయాన్ని సాధించారంటూ ప్రశంసించింది.
ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 ల్యాండర్‌పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం మరో 14 రోజులపాటు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఇతర శాస్త్రవేత్తలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని చైర్మన్ శివన్ చెప్తున్నా.. ల్యాండర్ దాదాపు విఫలమైనట్టేనని ఇస్రోకు చెందిన ఓ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. విక్రమ్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని, దానితో సంబంధాల పునరుద్ధరణ అసాధ్యమని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు.