నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక వర్గంః దర్శకుడు: సుకుమార్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్, క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్, లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించినా చివరి నిముషం వరకు సాంకేతిక పనులు కాక టెన్షన్ పడిన పుస్ప టీమ్‌కు ఎట్టకేలకు తెలుగులో విడుదలైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిబాటుగా వుండేలా టీజర్, ట్రైలర్ విడుదల, ఊ.. అంటావా.. ఊ..ఊ.. అంటానా పాట మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఏమేరకు వర్కవుట్ అయిందో చూడాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ :
పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఊరిలో ఆసామికి పుట్టిన కొడుకు. ఆసామి చనిపోవడంతో ఇంటి అసలు కొడుకు అజయ్ తన ఇంటిపేరు వాడుకోవద్దని అవమానిస్తారు. కనీసం చదువుకోవడానికి పనికిరానివాడిగా చేస్తారు. అలా టింబర్ డిపోలో కూలీగా చేస్తూ, ఆ తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలీవాడిగా సాగిస్తుంటాడు. దేన్నీ లెక్కచేయనితనం పోలీసుల కన్నుగప్పి స్మగ్లింగ్ చేయడం పుష్ప క్వాలిటీస్. దాంతో ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి (అజయ్ ఘోష్)కి పార్టనర్‌గా మారతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను(సునీల్)ను ఎదిరించి.. పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్‌గా మారతాడు.
మరోవైపు కూలీగా చేసే ఓ పెద్దాయన కూతురు శ్రీవల్లీని(రష్మిక మందన్న) చూసి ప్రేమలో పడతాడు. నిశ్చితార్థంనాడు మరలా చిన్నప్పటి ఇంటిపేరు అవమానం ఎదుర్కొంటాడు. ఆ తర్వాత కసితో ఎర్రచందనం సిండికేట్‌ను తన గుప్పిట్లోకి ఎలా తీసుకున్నాడు? ఆ తర్వాత వచ్చిన ఎస్.పి.తో జరిగిన గొడవ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
తగ్గేదే లే అన్న డైలాగ్‌తో సినిమా కూడా తగ్గేదేలే అన్నట్లుగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. కానీ మనసులో వారికి శంక నెలకొనివుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్న డైలమాలో నిన్నటి వరకు వున్నారు. దానికి తగినట్లే మొదటి భాగం చాలా స్లోగా సాగుతుంది.
ఇక రెండో భాగం వచ్చేసరికి కూలివాడు సిండికేట్ హెడ్‌గా ఎలా మారాడన్నదే పాయింట్. ఈ పాయింట్ సామాన్య ప్రేక్షకుడికి ఏమాత్రం కనెక్ట్ కాదు. పాత్రపరంగా పాత కాలంనాటి కేరెక్టర్లు, కథ కూడా పాతదే కాబట్టి ఓ కూలివాడికి స్మగర్ల నాయకుడికి మధ్య పోరుగానే సినిమా వుంటుంది తప్పితే ఎక్కడా ఎక్సయిట్మెంట్ కలిగించదు.
- ముఖ్యంగా అటవీ నేపథ్యం కనుక అక్కడి యాక్షన్ సీన్స్, ఎర్రచందనం దుంగలను ఎలా మాయచేసేవారో అన్న విషయాలు మైండ్‌గేమ్‌తో బాగానే చూపించాడు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో గ్రాండ్ విజువల్స్‌లో ఏ మాత్రం తగ్గలేదు. కథలోని మెయిన్ ఎమోషన్స్‌ను, బన్నీ పాత్రలోని షేడ్స్‌ను, రష్మిక మందన్నాతో సాగే లవ్ ట్రాక్ సరదాగా అనిపిస్తాయి.
- పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ జీవం పోశాడు. రఫ్ అండ్ మాస్ ఎలిమెంట్‌తో తనను తాను మలుచుకున్నాడు. ఎడమ భుజం వంగి పోయినట్టు వుండేలా మేనరిజం బాగా చూపించాడు. ఆయనతోపాటు శ్రీవల్లీగా రష్మిక మందన్న డీగ్లామర్ లుక్‌తో బాగున్నారు.
- ఇక పాటల పరంగా వెండితెరపై అంత ఎఫెక్ట్ అనిపించలేదనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్‌లో ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించింది. కానీ కామన్‌మేన్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
- ముగింపు దగ్గరు వస్తుండగా ఎస్.పి. పాత్రలో ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌గా బాగుంది. సిండికేట్ హెడ్‌గా మంగళం శ్రీనుగా సునీల్ అదే నైజం వున్న అతని భార్యగా అనసూయ నటించారు.
- అసలు మొదటి భాగంలో కథ ఏమిటో ఎవరికీ అర్థఃకాదు. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం సుకుమార్ చాలా స్లోగా నడిపాడు. ఇందులో ఏదీ చెప్పుకోదగిన సన్నివేశం అనిపించదు. ఎక్కడో శేషాచలం అడవుల్లో చేసే స్మగ్లింగ్ చైనా, జపాన్, విదేశాలకు ఎలా అమ్ముడవుతుంది. మాఫియా దేనికి దీన్ని కోట్లకు పెట్టి కొంటుంటారు. ఇక్కడ అమ్మేవారు ఎలా కోటీశ్వరులు అవుతారు. ఇందులో రాజకీయనాయకుల ప్రమేయం ఎంత వుంది? ఈ దొంగ వ్యాపారం చేసేవారిలో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు ఎలా వుంటుంది. పోలీసులలో అవినీతి ఎలా వుంది? నిక్కచ్చిగా పనిచేసే పోలీసు గతి ఏమిటి? అనేవి కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
సాంకేతిక పరంగా చూస్తే, దేవి శ్రీ ప్రసాద్ బాణీలు ఆకట్టుకున్నాయి. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి, ఏయ్ బిడ్డా ఇలా సాంగ్స్ అన్ని బాగున్నాయి. సినిమాకు హైలైట్ కుబ బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. ఎంతో రియలిస్టిక్‌గా, గ్రాండ్ విజువల్స్‌తో ప్రతి సీన్‌ను చాలా బ్యూటిఫుల్‌గా చూపించాడు.
- ముఖ్యంగా రాయలసీమ, చిత్తూరు యాసను బాగా పలికించేలా దర్శకుడు కేర్ తీసుకున్నాడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సినిమాలోని స్లో సీన్స్‌ను తగ్గించాల్సిందే. రెండు భాగాలు కాబట్టి అలా సాగదీశారనిపించింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై, చెర్రీలు తగ్గేదేలే అన్నట్లుగా ఖర్చు పెట్టి తీశాడు. అయితే ముగింపులో రెండో భాగం ట్విస్ట్.. పుష్పకు పెండ్లి కావడంతో అసలు కథ ఇప్పుడు మొదలైంది అనడంతో ముగుస్తుంది.
- పుష్పకు సవాల్‌గా నిలిచి, అవమానించిన ఎస్.పి. పాత్ర ఫాజిల్‌కూ పుష్పకు ఏమిటి సంబంధం అనేది రెండో భాగంలో చూడాలనిపించేలా వుంది. కానీ ట్విస్ట్ పెద్దగా వుండదు. చిన్నతనంలో ఆసామి ఇంటి పేరును తగిలించుకుంటేనే అవమానించిన కుటుంబంలోని వ్యక్తే అంటే పుష్పకు అన్న అయ్యేవాడా ఈ ఎస్.పి. అనిపించేలా ట్విస్ట్ వుంది. అలా వుంటే ఛత్రపతి కాన్సెప్ట్‌ను అటవీ నేపథ్యంలో సుకుమార్ తీశాడనిపిస్తుంది.
- ఇది తమిళనాడులోని పుష్పరాజ్, సింహరాజ్ అనే అన్నదమ్ముల కథగా ప్రచారం వుంది. అందుకు తగినట్లుగా సుకుమార్ పుష్ప అనే వ్యక్తి బయోపిక్‌గా నిన్న చెప్పాడు.
- మలయాళంలోనూ ఓవర్‌సీస్‌లో కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ సమస్యతో విడుదల కాని ఈ సినిమా అల్లు అర్జున్ మాస్ ఫ్యాన్స్‌కు మినహా కామన్‌మేన్‌కు ఏమాత్రం కనెక్టఖ్ కానీ కథ ఇది. దీన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.