Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కినేని అఖిల్ విశ్వరూపం... 'హలో' అదిరింది... రివ్యూ రిపోర్ట్(వీడియో)

'హలో' నటీనటులు: అఖిల్‌ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్‌, అజయ్‌, జగపతిబాబు, రమ్యకష్ణ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ తదితరులు; ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, కూర్పు: పవ్రీణ్‌ పూడి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: చంద్రబోస్‌, వనమాలి, శ్రేష

Advertiesment
అక్కినేని అఖిల్ విశ్వరూపం... 'హలో' అదిరింది... రివ్యూ రిపోర్ట్(వీడియో)
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (13:53 IST)
'హలో' నటీనటులు: అఖిల్‌ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్‌, అజయ్‌, జగపతిబాబు, రమ్యకష్ణ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ తదితరులు; ఛాయాగ్రహణం:  పి.ఎస్‌.వినోద్‌, కూర్పు: పవ్రీణ్‌ పూడి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: చంద్రబోస్‌, వనమాలి, శ్రేష్ట, నిర్మాత : అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌. 
 
అక్కినేని కుటుంబం వారసునిగా 'మనం'లో తళుక్కుమని మెరిసిన అఖిల్‌... తన పేరుతో సినిమా చేసినా ఆశించినంత ఫలితాన్ని పొందలేకపోయాడు. అందుకే ఆచితూచి అడుగువేసి 'హలో' అంటూ ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చాడు. 'మనం'లో ఎన్నో భావేద్వేగాలను పంచిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో చేసిన 'హలో' పూర్తి ప్రేమకథతోపాటు యాక్షన్‌ అంశాలు వుండేలా చేశారు. ప్రేమకథల్ని పండించగల అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో చిత్రమే ఇది. నాగార్జున ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకుని విడుదల చేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
శీను(అఖిల్‌), జున్ను (కల్యాణి) బాల్యంలోనే పానీపూరి బండి దగ్గర డెస్టినీ(విధి) కలిసిన స్నేహితులు. అనాధైన శ్రీను వయొలిన్‌ వాయిస్తూ రోడ్డుపక్క యాచన చేస్తుంటాడు. తన వయొలిన్‌తో పలికించే సంగీతమంటే ఇష్టపడే జున్ను ఓ పెద్దింటి పిల్ల. అనుకోకుండా జున్ను కుటుంబం ఢిల్లీ వెళ్లిపోతుంది. తన ఫోన్‌ నెంబర్‌ రాసి ఇచ్చిన వంద రూపాయల్ని శ్రీను పోగొట్టుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య లింక్‌ తెగిపోతుంది. 
 
ఆ తర్వాత విధి కల్పించిన ఓ ప్రమాదం ద్వారా ఓ పెద్దింటికి చెందిన జగపతిబాబు, రమ్యకృష్ణ వద్దకు శ్రీను దత్తపుత్రుడిగా వెళ్ళి అవినాష్‌గా మారిపోతాడు. అలా 14 ఏళ్ళ 3 నెలలు 20 రోజుల అయినా జున్ను కోసం ఎదురుచూస్తూనే వుంటాడు శ్రీను. ఇక ఢిల్లీకి వెళ్ళిన జున్ను.. ప్రియ(కళ్యాణి) తన స్నేహితురాలి పెళ్లి నిమిత్తం హైదరాబాద్‌ వస్తుంది. అదికూడా శ్రీను కోసమే. మళ్ళీ విధి కల్పించిన సంఘటన ద్వారా ఇద్దరూ ఒకరినొకరు కలుసుకుంటూనే వుంటారు. కానీ ఎవరికి ఎవరో తెలీదు. చివరికు అదే విధి ద్వారా వారిద్దరూ కలుస్తారు. అదెలా? అనేది సినిమా.
 
విశ్లేషణ :
మనం ఎవరితో వుండాలనేది మనం నిర్ణయించుకుంటాం. కానీ డెస్టినీ (విధి) మన ఎవరితో వుండాలనేది నిర్ణయిస్తుంది. అదే మనం కోరుకున్నవారితోనే అయితే 'హలో' కథ అవుతుంది. చాలా రేర్‌ కేసుల్లో జరిగే ప్రేమకథను అత్యంత హృద్యంగా ఆవిష్కరించిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌. మనుషుల మధ్య వుండే భావోద్వేగాలు, ఆరాటాలు, ప్రేమ, సంబంధాల్ని హృదయానికి హత్తుకునేలా తీశాడు. అలా 'మనం', '24' చిత్రాల్లో ఆయన నిరూపించాడు. 'మనం'లో క్లాక్‌ టవర్‌ డెస్టినీ అయితే, ఇక్కడ 'హలో'లో రామకృష్ణ వాటర్‌ ఫాల్‌ సెంటర్‌ డెస్టినీ. బాల్యంలో ఇక్కడే కలుసుకున్న ఇద్దరూ యుక్తవయస్సులోనూ అక్కడే కలిసినట్లు కలిసి దూరమవుతారు. ఈ సన్నివేశాలన్ని కవితాత్మకంగా ఆవిష్కరించాడు. 
 
ఇక నటనాపరంగా అఖిల్‌ కథకు టైలర్‌మేడ్‌ అని చెప్పాలి. డాన్స్‌తో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా రాణించాడు. స్వతహాగా అథ్లెట్‌ కాబట్టి రన్నింగ్‌లోనూ జంపింగ్‌లోనూ చురుగ్గా సునాయాసంగా చేయగల విన్యాసాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. హాలీవుడ్‌ జాకీచాన్‌ తెలుగులో అఖిల్‌ను పూనినట్లుంది. అతని ఆహార్యం, నటన థ్రిల్‌కు గురిచేస్తాయి. నటిగా కళ్యాణిని చూడగాచూడగా బాగుందనిపిస్తుంది. ఇక దత్తత తల్లిదండ్రులుగా రమ్యకృష్ణ, జగపతిబాబు నప్పారు. అంకుల్‌, ఆంటీ అని చిన్నప్పటినుంచి పిలిచే శీను విధి కల్పించిన ఓ సంఘటనతో అమ్మా, నాన్న అంటూ ఆప్యాయంగా పలికినప్పుడు తల్లిదండ్రులుగా వారు పడే భావోద్వేగం చూసి తీరాల్సిందే. ఇక శీను, జున్నులు చాలా కాలానికి కలిసినప్పుడు తెలీని ఏదో ప్రేమ వారిలో కన్పించడం దానికి తగినట్లు హావభావాలు పలికించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమే. 
 
అఖిల్‌కి రీలాంచ్‌ లాంటి సినిమా కోసం ఈ తరహా కథను ఎంచుకోవడం విశేషం. దర్శకుడు విక్రమ్‌ మార్క్‌ కథనం టేకింగ్‌పై నమ్మకంతో నాగార్జున తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఆ నమ్మకాన్ని విక్రమ్‌ నిలబెడుతూ పాత కథను కొత్తగా తీర్చిదిద్దారు. తొలి సగ భాగంలో చిన్నప్పటి ఎపిసోడ్‌ను విభిన్నంగా తీర్చిదిద్దాడు. విడిపోయిన శీను, జున్నులు ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నారని తెలిసేలోపే కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. అక్కడి నుంచి వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.  
 
ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. అవినాశ్‌, ప్రియలుగా పరిచయమైన నాయకానాయికలు వారు కలుసుకుని దగ్గరయ్యే వైనం ఆ తర్వాత ఒకరికొకరు శీను, జున్నులని తెలుసుకోవడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. పతాక సన్నివేశాలు బాగున్నాయి. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భావోద్వేగాలే సినిమాకు ప్రధానబలం.
 
సాంకేతిక ప్రమాణాలు ఉన్నతంగా వున్నాయి. హాలీవుడ్‌లో 'టెర్మినేటర్‌' వంటి పలు యాక్షన్‌ చిత్రాలకు పనిచేసిన బాబ్‌ బ్రౌన్‌ సమకూర్చిన పోరాట ఘట్టాలు, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, వినోద్‌ కెమెరా పనితనం, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా ప్రతీదీ సినిమా స్థాయిని పెంచేవే. దర్శకుడు విక్రమ్‌ ఇదివరకులా సంక్లిష్టమైన కథను ఎంపికచేసుకోలేదు. ఒక మామూలు కథనే అనుభూతిని, భావోద్వేగాలతో పండించడంలో మాత్రం సఫలమయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణ విలువలు వెండితెరపై అడుగడుగునా కనిపిస్తాయి. ఇప్పటితరంలో అన్ని వర్గాలను మెప్పిస్తూ ఆల్‌రౌండర్‌గా అఖిల్‌ నిలుస్తాడని నిరూపించిన చిత్రమిది.
 
రేటింగ్ ‌: 3.5/ 5
వీడియో....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజంగానే డార్లింగ్.. నన్ను బుట్టలో పడేశాడు : శ్రద్ధా కపూర్