నేచురల్ స్టార్ నానీ తాజాగా నటిస్తున్న చిత్రం "జెర్సీ". ఈ చిత్రం ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నానికి జోడీగా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలను సమకూర్చాడు.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు వంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ భారత క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కుటుంబసభ్యులకు కొంత సంబంధం ఉంది. అదేమిటి తెలుగు సినిమా జెర్సీకి, సచిన్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా?
అదేనండి ఈ చిత్రంలో నాని అర్జున్ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ పేరు కాస్త సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ పేరు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సారా అనే పేరుతో కనిపించనుంది. సారా పేరు కూడా సచిన్ కుమార్తె పేరు కావడం విశేషం.
దర్శకుడు ఒకవేళ సచిన్ వీరాభిమాని అయి ఉండవచ్చు, కాబట్టే సచిన్ కుమారుడు, కుమార్తె పేరును సినిమాలో ఉపయోగించుకున్నాడు. అది కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో దీనిని ఉపయోగించుకోవడం గమనార్హం.