రామ్ గోపాల్ వర్మ చిత్రమంటూ.. ఈ నెల 24న విడుదల కాబోతున్న సినిమా మర్డర్. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ముందుగా విడుదల కావడం, యదార్థగాధ అనడం, తండ్రీకూతుళ్ల కథ అనడంతో.. ఇది నల్లొండ లోని ఆమధ్య జరిగిన అమృత, మారుతీరావ్ కుటుంబ కథా చిత్రమని తెలిసిపోయింది. దాంతో సెన్సార్ అభ్యంతరాలతోపాటు ఆ ఇరు కుటుంబాల వారు చేసిన అభ్యంతరంతో కోర్టు వరకు వెళ్ళింది.
చివరకు హైకోర్టు కూడా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నల్లొండలోని నటరాజ్ థియేటర్‌లోనే కాకుండా ఆ జిల్లాలో ఎక్కడా ఈ సినిమాను ఆడించడానికి వీలులేదని మారుతీరావు కుటుంబీకులు అడ్డకున్నారు. నటరాజ్ థియేటర్‌లో సినిమాను వేయవద్దని.. మారుతీరావు కుటుంబంతోపాటు అమృత ప్రేమించి పెండ్లి చేసుకున్న ఆ కుటుంబం కూడా అడ్డుకున్నారు. అయితే సినిమా చూడకుండా ఎలా మీరు అభ్యంతరం పెడతారని తిరిగి చిత్ర నిర్మాత నట్టికుమార్ కోర్టుకు వెళ్ళారు.
ఎట్టకేలకు రిలీజ్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. నల్లొండ మిర్యాలగూడలలో ప్రెస్‌మీట్ పెట్టి.. వారి అనుమానాలను తీర్చాలని నిర్మాత దర్శకుడు అనుకున్నారు. అనుకున్నట్లు.. ఈనెల 21న అక్కడ ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకుని రంగం సిద్ధం చేశారు. కానీ పోలీసులు అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో వర్మ కూడా వెనక్కు తగ్గారు. అయితే ఈనెల 24న విడుదల తర్వాత వారే మనస్సు మార్చుకుని మేం ఎలా తీశామో.. తెలుసుకుంటారనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు.
అసలు ఈ సినిమాకు దర్శకుడు ఆనంద్.. ఇతను వర్మ శిష్యుడు. తండ్రి అతి గారాభం చేస్తే కూతురు ఏవిధంగా ప్రవర్తిస్తుంది అనేది చిత్ర కథ. ఇది అందరి తండ్రుల కథ. ఏ ఒక్క మారుతీరావు కథ కాదని నట్టికుమార్ తేల్చి చెబుతున్నారు. ఈ సినిమాను రెండు రోజుల ముందుగానే మీడియాకూ, పంపిణీదారులకు, ఎగ్జబిటర్లకు హైదరాబాద్‌లో చూపించారు.
ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ.. నటరాజ్ థియేటర్ అనేది మారుతీరావుది. ఇప్పుడు అది ఆసుపత్రిగా మారింది. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా మర్డర్ సినిమా వేయవద్దని ఆ కుటుంబాలు కేసు వేశారు. కనుక వర్మగారు ఈనెల 24 తర్వాత అక్కడకు వచ్చి ప్రెస్‌మీట్ పెడతారని.. చెప్పారు.