Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మశానంలో "జీఎస్టీ" మూవీ ఫస్ట్ లుక్ లాంచ్....

స్మశానంలో
, సోమవారం, 14 డిశెంబరు 2020 (17:48 IST)
సినిమా ప్ర‌మోష‌న్ కొత్త పుంత‌లు తొక్కుతుంది. స‌స్పెన్సు మిస్ట‌రీ సినిమాకు చెందిన జిఎస్‌.టి. సినిమా పోస్ట‌ర్‌ను.. ఏకంగా శ్మ‌శానంలో విడుద‌ల చేసింది చిత్ర బృందం.."తోలు బొమ్మల సిత్రాలు" బ్యానరుపై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'GST' (GOD SAITHAN TECHNOLOGY). ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని స్మశానంలో  దెయ్యం  విడుదల చేసింది.
 
ఈ సందర్భంగా  స్మశానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు జానకి రామ్ మాట్లాడుతూ... ఇంతవరకు ఎవ్వరూ చేయని వినూత్న రీతిలో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నిజమైన స్మశానంలో దెయ్యం చేత  విడుదల చేశాం. ఇది నాలుగు గోడల మధ్య చూసే "GST" కాదు నలుగురితో కలిసి చూసే సినిమా, చూసిన తర్వాత మరో నలుగురిని తీసుకొచ్చి చూపించబోయే సినిమా అని చెప్పాను.
 
ఇక అసలు విషయానికి వస్తే.. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అన్నాచెల్లెళ్లతో, భార్య భర్తలతో, ఇలా ఎన్నో బంధాలతో ముడిపడి వున్నట్టు... ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషికి కూడా దేవుడు, దయ్యం,సైన్స్‌తో ముడిపడి ఉంటుంది. కానీ.. కొందరు దేవుడున్నాడని, ఇంకొందరు దెయ్యం ఉందని, మరికొందరు సైన్స్ నిజమని, ఇలా ఎన్నో ప్రశ్నలతో వాగ్వాదాలు జరుగుతూ.. మనలో మనమే బంధాలను తెంచేసుకుంటున్నాము. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేదే నా సినిమా ఉద్దేశం. 
 
అంతెందుకు రీసెంట్‌గా  ''మోనోలిత్'' అనే ఏకశిల స్తంభం మొదట అమెరికాలో ప్రత్యక్షమయ్యింది. కొన్ని రోజులకు అక్కడ మాయమై వెంటనే రొమానియాలో ప్రత్యక్షమయ్యింది. అక్కడ మాయమై తర్వాత బ్రిటన్‌లో ప్రత్యక్షమయ్యింది. అక్కడ మాయమై ఇప్పుడు నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమయ్యింది. అసలు ఈ వింత స్తంభం ఎందుకు ప్రత్యక్షమౌతుంది. ఎలా మాయం అవుతుందని తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.
 
''మోనోలిత్' ప్రపంచ వ్యాప్తంగా మిస్టరీ‌గా మారిందని ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అలాగే... మనిషి చనిపోయిన తర్వాత.. వారు దెయ్యాలు అవుతారని, వారి ఆత్మలు ఆవహిస్తాయని, జనాలను బలి తీసుకుంటుందనీ.. ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, మనుషుల మధ్య ఉన్నాయి. మరి వాస్తవంగా దెయ్యం ఉందా? లేదా? అనేది నా సినిమాలో చెప్పబోతున్నాను.
 
నేను ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్‍ని స్మశానం లోనే ఎందుకు ఎంచుకున్నానంటే.. మనిషి పుట్టిన తర్వాత ఆతని జీవితం.. ఫుట్‌పాత్‌పై పెరిగినా, పూరి గుడిసెలో బతికినా, ఇంద్ర భవనంలో జీవించినా.. చిట్టచివరికి వచ్చేది స్మశానంలోకె. కానీ.. ఆ స్మశానాన్ని ఒక అపవిత్ర స్థలంగా భావిస్తూ, అందులో భూత ప్రేతాత్మలు ఉంటాయని ఇక్కడికి రావడానికి భయపడుతుంటారు. మరి దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావించినప్పుడు, ఏదైనా కార్యక్రమం మొదలెట్టినప్పుడు.. శుభముహూర్తాలు చూసుకొని ప్రారంభించినప్పుడు.. స్మశానాలను  పవిత్ర స్థలంగా ఎందుకు భావించకూడదు? 
 
ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అష్టమిలో, అమావాస్యలో, దుర్ముహూర్థాలలో ఎందుకు ప్రారంభించకూడదు అనేది నా ప్రశ్న? నేను వాస్తవాలు చెప్పబోతున్నాను కాబట్టే.. ఈ రోజు అర్థరాత్రి ఆదివారం ఈ స్మశానంలో మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎంతో మంది డైరెక్టర్లు దెయ్యం గురించి ఎన్నో హర్రర్ సినిమాలు తీశారు. వారందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. నేను వాస్తవాలు చెప్పబోతున్నాను కాబట్టే.. వాటన్నిటికీ భిన్నంగా ఒక దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాను.
 
రేపు ఈ సినిమాను చూస్తున్నంత సేపు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా భావిస్తూ, కామెడీ, సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్, రొమాన్స్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకర్షించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుందని భావిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ని 'దెయ్యం' లాంచ్ చేసినందుకు దెయ్యానికి, వారి జాతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
 
ఈ చిత్రం హీరోలు ఆనంద్ కృష్ణ, అశోక్, హీరోయిన్స్ స్వాతి మండల్, యాంకర్ ఇందు పూజ సుహాసిని, కామెడీ పాత్రలో జూనియర్ సంపూ, ఇతర తారాగణం వెంకట్ నందు, వాణి, స్వప్న, 'వేదం' నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు, 'జానపదం' అశోక్, రాథోడ్ మాస్టర్, సూర్య, రమణ, సంతోష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత అక్కినేని ఆస్తుల విలువ ఎంతో తెలుసా?