సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సభా వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపాయి.
ముఖ్యంగా, ఏపీ సీఎం జగన్ - హీరో మోహన్ బాబు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వాన్ని తెరపైకి తెచ్చారు. పైగా, సినీ రంగ సమస్యలపై మోహన్ బాబు వంటి పెద్దలు స్పందించాలని, ఏపీలో తన బంధువులైన వైసీపీ నాయకులతో మాట్లాడి చిత్ర పరిశ్రమను హింసించొద్దని మోహన్ బాబు చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్... నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఏకవచనంతో సంబోధించాను. అయితే పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలా కాలానికి తనను ఈ వ్యవహారంలోకి లాగావు... సంతోషం. అయితే ప్రస్తుతం 'మా' ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది, అక్టోబరు 10న 'మా' ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను.
'మా' ఎన్నికల్లో తన కుమారుడు మంచు విష్ణు పోటీ చేస్తున్నాడని, పవన్ కల్యాణ్ తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్‌కు ఓటేయాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు.