హీరో సాయిధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కాస్త పొలిటికల్ సభగా మారిపోయింది. చిత్ర పరిశ్రమను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు వైకాపా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా మంత్రులను సన్నాసులు, దద్దమ్మలతో పోల్చారు.
తమను టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గట్టిగానే కౌంటరిచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు.
పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి? అని నిలదీశారు.
ఏపీలో చోటు లేదని తెలిసి పవన్ మాటల్లో నిస్పృహ కనిపిస్తుందన్నారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకుని బతికాలనుకునే నీచపు వ్యక్తి పవన్ అంటూ నిప్పులు చెరిగారు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని… ప్రకాశ్ రాజ్ నటనలో 25 శాతం కూడా నటించటం చేతకాదని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి.
ఫామ్ హౌస్‌లో కూర్చుని పేకాట ఆడటం తప్ప దేనికీ పనికి రాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను, మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.