మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్.. విడుదలైన ఒక్క రోజుకే కలెక్షన్లు రాబట్టింది. మణిరత్నం హిస్టారికల్ మూవీ అయిన ఈ పీఎస్-1 తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 80కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.
PS-1 విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలను నమోదు చేసుకుంది. దీంతో విడుదలైన తొలిరోజే ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేగాకుండా తమిళ సినిమాకి బిగ్గెస్ట్ ఎవర్ ఓపెనింగ్ డేగా నిలిచింది.
చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రంపై దక్షిణాదిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రం తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్‌ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ 'పీఎస్1'కి భారత్‌తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. అమెరికాలో 'పీఎస్1' దూసుకెళ్తోందని టాక్ వస్తోంది.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇంకా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు.