సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన రెండో కుమారుడు, సినీనటుడు మంచు మనోజ్ బుధవారం యూనివర్శిటీ లోపలికి వెళ్లేందుకు వచ్చారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది మోహన్ బాబు ఆదేశం మేరకు గేట్లను మూసివేసి తాళం వేశారు. ఇప్పిటకే యూనివర్శిటీలో మోహన్ బాబు, మంచు విష్ణులు తమతమ కుటుంబ సభ్యులతో ఉన్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మంచు మనోజ్ రాకతో యూనివర్శిటీ ప్రాంగణం వద్ద ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.
ఇక మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని, రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవ్వరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరుగుతుందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు.
కాగా, యూనివర్శిటీ వద్దకు వెళ్లే ముందు మంచు మనోజ్ దంపతులు రాష్ట్ర మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను నారావారి పల్లెలో కలుసుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయన యూనివర్శిటీ వద్దకు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గేటు ముందు మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. గేటు లోపల ఉన్న వ్యక్తిని ఓరేయ్ 'ఎలుగుబంటి' గేట్ తీయ్ అంటూ గట్టిగా అరిచాడు.