Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరువు నష్టం దావా కేసు విచారణ నిలిపివేయాలి : కోర్టుకు కంగనా

Advertiesment
Kangana Ranaut

ఠాగూర్

, ఆదివారం, 7 జనవరి 2024 (10:35 IST)
తనపై ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ నిలిపివేయాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తాను వేసిన క్రాస్ పిటిషన్‌‍తో కలిపి దాన్ని విచారించాలని విజ్ఞప్తి చేశారు. తన పరువుకు భంగం కలిగేలా జాతీయ టీవీ ఛానళ్లలో కంగనా మాట్లాడారని ఆరోపిస్తూ అక్తర్ 2020లో ఆమెపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
 
మరోవైపు నేరపూరిత కుట్ర, గోప్యతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలతో అక్తర్‌పై కంగనా క్రాస్ పిటిషన్ వేశారు. దీంతో 2023, జులై 24న అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు అక్తర్‌కు సమన్లు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా దిండోషిలోని సెషన్స్ కోర్టులో ఆయన రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కంగనా ఫిర్యాదుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్, సమన్ల జారీపై ఆ కోర్టు స్టే విధించింది.
 
ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగనా గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. హృతిక్‌తో గొడవ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదేవిషయంలో జావేద్ తనను ఇంటికి పిలిచి మరీ బెదిరించారని ఆరోపించారు. కంగనా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జావేద్ ఆమెపై పరువునష్టం దావా వేశారు.
 
అక్తర్, తన ఫిర్యాదులు ఒకే సంఘటనకు సంబంధించినవనీ.. రెండు విరుద్ధ తీర్పులను నివారించడానికి వాటిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని కంగనా తాజాగా హైకోర్టును కోరారు. తన పిటిషన్‌పై విచారణ ఆగిపోయిందని, అక్తర్‌ పిటిషన్‌పై విచారణ మాత్రం కొనసాగుతోందని.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కంగనా రనౌత్ వేసిన పిటిషన్‌‌ను స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్ జనవరి 9న విచారించే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరి.. ఎప్పుడంటే?