Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"డు యు నో నాటు"... ఆస్కార్ వేదికపై నాటు పాటను పరిచయం చేసిన దీపిక

Advertiesment
deepika
, సోమవారం, 13 మార్చి 2023 (12:52 IST)
లాస్ ఏంజిల్స్‌‍లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో లాస్‌ డాల్బీ థియేటర్‌ 'నాటు నాటు'తో దద్దరిల్లిపోయింది. 
 
అయితే, ఈ అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె పరిచయం చేయగా.. ఆ తర్వాత గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో పాడారు. ఈ సందర్భంగా పాట నేపథ్యం గురించి అవార్డుల వేడుకకు హాజరైన వారికి దీపిక ప్రత్యేకంగా వివరించడం విశేషం.
 
"తిరుగులేని గానబృందం.. ఉర్రూతలూగించే బీట్స్‌.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చేశాయి. విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ మధ్య స్నేహాన్ని చాటిచెప్పిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది. దీన్ని తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకోవడమే గాక.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. అంతేనా.. భారత సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి పాటగా ఘనత సాధించింది. 'డు యూ నో నాటు?' తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. "ఆర్‌ఆర్‌ఆర్‌" చిత్రం నుంచి 'నాటు నాటు' ఇదే.." అంటూ దీపిక ఈ పాటను పరిచయం చేయడంతో అక్కడున్నవారంతా చప్పట్లతో స్వాగతం పలికారు.
 
ఈ పాటను దీపిక పరిచయం చేసిన తర్వాత గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడగా.. వెస్ట్రన్‌ డ్యాన్సర్లు తమ డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ప్రదర్శన పూర్తయిన తర్వాత వేదికలో పాల్గొన్నవారంతా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించడం విశేషం. మరోవైపు, ఆస్కార్‌లో దీపిక నాటు నాటు పాటను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి భారతీయుడు గర్వపడే క్షణాలివి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఎవ్రీథింగ్‌"కు అవార్డుల పంట.. ఆస్కార్ వేదికపై సత్తా చాటిన 'నాటు నాటు' సాంగ్