గత యేడాది డిసెంబరు నెలలో రిలీజై భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం "కెజిఎఫ్". ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2 షూటింగ్ జరుగుతోంది. పరిమితులు అధికంగా ఉండే శాండల్‌వుడ్ మార్కెట్‌ని ఒక్కసారిగా రూ.200 కోట్ల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈ చిత్రానికే దక్కుతుంది.
ఏ కన్నడ సినిమా నార్త్‌లో ఇప్పటివరకూ ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. దీంతో ప్రజల్లో అంచనాలు పెరగటంతో కెజిఎఫ్ 2 బడ్జెట్‌ని అమాంతంగా ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌కు పెంచినట్టు టాక్. ఇప్పటిదాకా ఏ కన్నడ సినిమాని ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించలేదు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగానికి చాలా మార్పులు చేసినట్లు తెలిసింది. ఫలితంగా బడ్జెట్ రేంజ్ పెరిగిపోయింది. దీనికితోడు రెట్టింపు సంఖ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్‌లో షూటింగ్ కోసం యష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.
కెజిఎఫ్ గనులను తన ఆధీనంలోకి తీసుకున్నాక రాఖీ భాయ్ దేశ మాఫియాని శాసించే స్థాయికి ఎదిగి ప్రధాన మంత్రే తన మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చే లెవెల్‌కి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ మీద చాప్టర్ 2 రూపొందింది. సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి సీనియర్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.