నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ-2 చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం చివరి నిమిషంలో విడుదలకు నోచుకోలేదు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ - 14 రీల్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు పరిష్కారం కాలేదు. దీంతో ఈరోస్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు విడుదలకు బ్రేక్ వేసింది. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం 14 రీల్స్ నిర్మాణ సంస్థ యాజమాన్యం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "అఖండ-2"ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేసాం. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీలకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. 'అఖండ-2' ఎప్పడు వచ్చినా గురి చూసి కొడుతుంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం' అని 14 రీల్స్ నిర్మాణ సంస్థ తన ఎక్స్ పేజీలో ఓ ట్వీట్ చేసింది.