ఏ సినీ, రాజకీయ ప్రముఖుడు విడాకులు తీసుకున్న అతనితో నాతో పెళ్లి అంటూ రాసేస్తున్నారంటూ సినీ నటి మీనా ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం తదితర ఆసక్తిక విషయాలపై స్పందించారు. అలాగే, సూపర్ స్టార్లు కృష్ణ, రజనీకాంత్‌లకు కుమార్తెలుగా నటించానని గుర్తు చేశారు. అలాగే, రజనీకాంత్‌కు హీరోయిన్‌గా కూడా 'ముత్తు' చిత్రంలో నటించానని తెలిపారు.
తాను కెరీర్‌లో వరుస అవకాశాలు వస్తున్నపుడే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత పాప పుట్టిన రెండేళ్లకు మలయాళ సినిమా దృశ్యం కోసం తనను సంప్రదించారన్నారు. పాపను వదిలి వెళ్లలేక ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు చెప్పారు. ఆ చిత్ర కథ రాసేటపుడే తనను దృష్టిలో ఉంచుకునే రాశామని, మరో నటితో సినిమా తీయలేమని చెప్పారన్నారు. దీంతో మరో మార్గం లేక అంగీకరించినట్టు తెలిపారు.
తన భర్త చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నా భర్త చనిపోయిన వారం తర్వాత నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు రాశారు. వాళ్ళకు కుటుంబాలు ఉండవా. ఇలా రాస్తున్నారు అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేస్తున్నారు. అలాంటి వార్తలను చూసినపుడు నాకు అసహ్యం వేస్తుంది అని పేర్కొన్నారు.