బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీత. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన సీత ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా పల్టీ కొట్టింది. దీంతో ఈ సినిమాలో హీరోగా నటించినందుకు బెల్లంకొండ శ్రీనివాస్ పశ్చాత్తాపపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నటించవద్దని ముందుగానే అతని తండ్రి బెల్లంకొండ సురేష్ హెచ్చరించాడట. అయితే... తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఈ సినిమానే చేస్తానన్నాడట. తండ్రి సురేష్ ఎంత చెప్పినా వినలేదు. అదే సమయంలో వచ్చిన మరో సినిమాను చెయ్యమని కొడుక్కు సలహా ఇచ్చాడు. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ కొడుక్కి కాస్త సీరియస్‌గానే చెప్పాడట బెల్లంకొండ సురేష్.
అంతలా నచ్చపోవడానికి కారణం... సీత కథ, ఆ కథలో శ్రీనివాస్ కేరెక్టర్ బెల్లంకొండ సురేష్‌కి ఏమాత్రం నచ్చలేదట. ఆ సినిమా హిట్టయ్యే అవకాశాలు లేవనీ ఆయన ముందుగానే పసిగట్టారని... అందుకే కొడుకును ఆ సినిమా చేయవద్దని సూచించాడనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కారణం వల్లే ఆ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్లకూ ఆయన దూరంగా ఉన్నాడు. సినిమా విడుదలయ్యాక తండ్రి మాటే నెగ్గడంతో శ్రీనివాస్ బాగా ఫీలవుతున్నాడట. తండ్రి మాటను కాదని సీతను చేసినందుకు ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం శ్రీనివాసా...?