హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళలో ఒకటైన రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.
అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, తమను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. పోలీసులు వారి నుంచి సమాచారం సేకరించి విడుదల చేశారు. పార్టీలో ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని పోలీసులు నిర్థారించారు. పబ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.