Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖమ్మం బాలుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు

Advertiesment
italian couple
, మంగళవారం, 11 జులై 2023 (10:29 IST)
ఇటలీ దేశానికి చెందిన ఓ దంపతుల జంట ఖమ్మం బాలుడిని దత్తత తీసుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలని భావించారు. ఇందుకోసం ఇంటర్నెట్‌లో గాలించగా ఖమ్మానికి చెందిన బాలుణ్ని ప్రభుత్వం దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చూశారు. ఆ వెంటనే ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ దత్తత నిబంధనలన్నీ పూర్తి చేశారు. వారితో వెళ్లేందుకు బాలుడు కూడా అంగీకరించాడు. దీంతో సోమవారం ఖమ్మం వచ్చిన ఇటలీ దంపతులకు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ బాలుణ్ని అప్పగించారు. ఇంతకాలం పిల్లలు లేని వారికి పుత్ర వాత్సల్యం, అనాథగా బతుకీడుస్తున్న బాలుడికి కుటుంబ ప్రేమ లభించనున్నాయి.
 
తన కుమారుడిని సాకలేనని ఓ తల్లి పదేళ్ల కిందట ఖమ్మం శిశుగృహకు అప్పగించి వెళ్లింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ బాబును అనాథగా ప్రకటించి సంరక్షణ బాధ్యతలను చేపట్టింది. ప్రస్తుతం అతను నాలుగో తరగతి చదువుతున్నాడు. బాలుడిని దత్తత ఇచ్చేందుకు వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ కారా(సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ)లో ఉంచారు. 
 
ఇలా కాలం గడిచిపోతున్న తరుణంలో ఇటలీకి చెందిన దంపతులు స్టెఫానో పెట్టొరలి, మరీనా గత ఏడాది జూన్‌లో కారా సైట్‌ను సంప్రదించారు. అధీకృత విదేశీ అడాప్షన్‌ ఏజెన్సీ సహకారంతో అడిగిన అన్ని పత్రాలు సమర్పించారు. బాలుడిని దత్తత తీసుకునేందుకు అంగీకరిస్తూ ప్రక్రియను కొనసాగించారు. ఈ ఇద్దరూ ఇటలీలో ఉద్యోగులు. భారత ప్రభుత్వ దత్తత నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించిన అధికారులు అనుమతులు ఇచ్చారు. 
 
ప్రభుత్వ నియమం ప్రకారం దత్తత స్వీకరించే దంపతులతో పాటు ఎనిమిదేళ్ల వయసు దాటిన పిల్లల స్వీయ అంగీకారం కూడా తప్పనిసరి. సదరు బాలుడిని నాలుగు నెలల పాటు కౌన్సెలింగ్‌ చేసిన తర్వాత అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బాలుడు కూడా వారితో వెళ్లేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సమక్షంలో డీడబ్ల్యూఓ జ్యోతి, డీసీపీఓ విష్ణువందన సదరు బాలుడిని  సోమవారం అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... చిన్నారి ప్రాణాలు తీసింది...