ఇటీవల చైనా బలగాల దాడిలో చనిపోయిన భారత ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించనున్నారు. లడఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబుతో పాటు.. మరో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
ఈ అమర కల్నల్ ఫ్యామిలీని సీఎం కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించనున్నారు. సూర్యాపేటలో నివాసముంటున్న కర్నల్ ఇంటికి మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి వెళ్లనున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అందించనున్నారు.
దేశం కోసం ప్రాణత్యాగంచేసిన వీరజవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు. తమవంతుగా కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం తానే స్వయంగా వెళ్లి ఆ సహాయాన్ని అందిస్తానని తెలిపారు.
సంతోష్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం, హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఇంటిస్థలం ఇవ్వనున్నది. సీఎం పర్యటన నేపథ్యంలో సంతోష్‌బాబు ఇంటివద్ద బందోబస్తు పటిష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, సంతోష్ బాబు ఇంటిలోకి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ మాత్రమే వెళ్లనున్నట్టు తెలిసింది. సీఎం వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో కరోనా నేపథ్యంలో ఎవ్వరూ రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.